J365న్యూస్, కొత్తగూడెం:ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధన కోసం మనందరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ , అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తో కలసి జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆచార్య జయశంకర్ జీవిత చరిత్ర సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను మననం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర మరువలేనిదని చెప్పారు. జయశంకర్ 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా ఆచార్య జయశంకర్ నిలిచారని పేర్కొన్నారు.
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చక్కటి ప్రావీణ్యం ఉందని చెప్పారు. స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ది కొరకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారని ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ అధికారి అనసూయ, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, జిల్లా పరిపాలన అధికారి గన్యా మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
