రానున్న 36 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గిరిజన గ్రామాలలో మారుమూల ప్రాంత గిరిజనులందరూ అప్రమత్తంగా ఉండి ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి మీ పిల్లలను వాగులు వంకల వైపు వెళ్లకుండా చూడాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున గిరిజన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.గోదావరి వరదల ముంపునకు గురి అయ్యే ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజన ప్రజలు, ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులను ముందస్తుగా అప్రమత్తంగా ఉంచాలని, భారీ వరద ప్రవాహ సమయంలో నదులు, కాలువలు, చెరువులు వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని, వాటిని దాటేందుకు ప్రయత్నించరాదని అన్నారు.అలాగే రహదారులు, కల్వర్టులపై నీరు ప్రవహిస్తున్న చోట్ల కూడా దాటడానికి సాహసించకూడదని, తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున గిరిజనులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోని కాచి వడబోసిన మంచినీటినే తాగాలని, పరిసరాల ముందు నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలని, విద్యుత్ సరఫరా నిలిచిన సందర్భంలో ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.ప్రసవం సమీపించిన గిరిజన గర్భిణీలను ముందుగానే ఆసుపత్రులు లేదా గర్భిణీల వసతి కేంద్రాలకు తరలించాలని అన్నారు.గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థుల పట్ల హెచ్ఎం వార్డెన్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని,పిల్లలు ఎవరు వారి ఇన్స్టిట్యూషన్ పరిధిలోని వాగులు వంకలకు వెళ్లకుండా చూడాలని మరియు పాఠశాలలో పరిశుభ్రత పాటించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
