Mon. Jun 22nd, 2026

అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా జూన్ 23న నిర్వహించనున్న “ఒలింపిక్ డే రన్” కార్యక్రమానికి సంబంధించిన టీ-షర్టులను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రన్ పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభం కానుండగా, జిల్లాలోని క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో భారత్ మరింత ముందంజలో నిలవాలంటే యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవడం అవసరమని, ఒలింపిక్ ఉద్యమ స్ఫూర్తిని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఒలింపిక్ డే రన్ ద్వారా యువతలో క్రీడా చైతన్యం పెరగడంతో పాటు ఒలింపిక్ క్రీడలపై అవగాహన, ఆసక్తి మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టీ-షర్టులను స్పాన్సర్ చేసిన రామదాసు, కేటీపీఎస్ టీజేఎల్ఎస్‌ఎస్‌ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె. మహిధర్, జిల్లా అథ్లెటిక్స్ కోచ్ నాగేంద్ర, టీజీటి డబ్ల్యు బ్ల్యూఆర్‌డీసీ డిగ్రీ కళాశాల పీడీ శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Share this post...