Tue. Jul 7th, 2026

*తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి.

* జూలై 7 విద్యార్థుల నిరసన ప్రదర్శన విజయవంతం.

J365న్యూస్,కొత్తగూడెం: వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు నిర్వహించిన విద్యార్థుల నిరసన ప్రదర్శన విజయవంతంగా జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగక్రిష్ణ , పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు బుర్ర వీరభద్రం , పీడీఎస్ యు జిల్లా కార్యదర్శి మునిగెల శివప్రశాంత్ , ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ , పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి దుగ్గం ప్రణయ్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP–2020) పేరుతో విద్యను కార్పొరేటీకరణ, కాషాయీకరణ దిశగా నడిపిస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులు తగ్గించడం, విద్యా రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల లేమి, ఖాళీ పోస్టుల భర్తీ లేకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదలలో జాప్యం, హాస్టళ్లలో సరైన సౌకర్యాల లేమి, మెస్ ఛార్జీల పెంపు చేయకపోవడం వంటి సమస్యలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల కుదింపు, విలీన నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలి.

కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమ ఫీజులు వసూలు చేయడం, పుస్తకాలు, యూనిఫాంలు, షూస్, టైలు, బెల్ట్లు తదితర వస్తువులను పాఠశాలలే మార్కెట్లు అన్నట్లుగా విక్రయించడం ద్వారా తల్లిదండ్రులను దోచుకుంటున్నా ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా రంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను నిలిపివేయాలనీ, ప్రభుత్వ విద్యాసంస్థలకు తగిన నిధులు కేటాయించి బలోపేతం చేయాలనీ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జూలై 10న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మాదాసు అఖిల్, రవీందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు తరుణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వినయ్ , సంజయ్ , పిడిఎస్ యు  నాయకులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...