
పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులలో చదువులో వెనకబడ్డ పిల్లలకు రాత్రి ఉదయం స్టడీ అవర్స్ ప్రతిరోజు తప్పని సరిగా జరిగేలా చూసి హెచ్ఎం వార్డెన్ మరియు సబ్జెక్ట్ టీచర్లు పిల్లలతో పాటు రాత్రి బస చేయాలని వాటికి సంబంధించిన ఫోటోలు రాత్రి 11 గంటల లోపు తనకు పంపించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సంబంధిత హెచ్ఎం వార్డెన్ లకు ఆదేశించారు.శనివారం నాడు బీఈడీ కళాశాలలో హెచ్ఎం వార్డెన్ లతో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు చేపట్టవలసిన కార్యాచరణ పై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు గడువు దగ్గర పడుతున్నందున స్పెషలాఫీసర్లు,ఏటీడీవోలు, హెచ్ఎం వార్డెన్లు ప్రత్యేక బాధ్యతను తీసుకొని పిల్లలందరూ పరీక్షలు బాగా రాసేలా వారికి అవగాహన కల్పించాలని,ఫ్రీ ఫైనల్ పరీక్షలు కాగానే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు పిల్లలు రాసిన విధానాన్ని గమనించి వారికి తప్పులు లేకుండా పరీక్షలు రాసేలా చూడాలని,సబ్జెక్ట్ టీచర్లు పిల్లలకు సబ్జెక్టుల విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని,పదవ తరగతి పిల్లలకు ఆహార విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని,తరగతి గదులు, వంటగది, డైనింగ్ హాల్,డార్మెటరీ శుభ్రంగా ఉంచుకోవాలని, ఎండాకాలం సమీపిస్తున్నందున పిల్లలకు ఎండ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, హెచ్ఎం వార్డెన్ ల తో పాటు టీచర్లు ఎవరు సెలవులు పెట్టకూడదని, అత్యవసరముగా సెలవు పెట్టదలుచుకుంటే ఏటీడీవో,డిడి ద్వారా అనుమతి తీసుకోవాలని,ఏటీడీవోలు తమ పరిధిలోని పాఠశాలలను రాత్రిపూట మాత్రమే విజిట్ చేయాలని, స్టడీ అవర్స్ లో పిల్లలు హోంవర్క్ చేస్తున్నది లేనిది చూడాలని, పరీక్షలు అంటే పిల్లలు భయపడకుండా వారి కదలికలను గమనించి వారికి ధైర్యం చెప్పి పిల్లలందరూ పరీక్షలు బాగా రాసేలా చూసి ప్రతి ఇన్స్టిట్యూషన్లో అత్యుత్తమ గ్రేడ్ లో పిల్లలందరూ పాసయ్యేలా చూడాలన్నారు.త్వరలో పాఠశాలల వారీగా కెరియర్ గైడెన్స్ ప్రేరణ కార్యక్రమాలు ఆ మండలంలోని అన్ని శాఖల అధికారులతో ప్రారంభిస్తామని సంబంధిత ఏటీడీవోలు హెచ్ఎంలు పదవ తరగతి చదివిన తర్వాత ఏ రంగంలో స్థిరపడతారో పిల్లల్లో దాగి ఉన్న గోల్ గురించి తెలుసుకొని అధికారులు ఇచ్చే సలహాలు సూచనలను పిల్లల అర్థం చేసుకునేలా వారిలో స్ఫూర్తి నింపాలని అన్నారు.ప్రతి పాఠశాలలో మైనర్ రిపేర్లు ఏమైనా ఉంటే చేయిస్తామని,నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ వల్ల వంట పాత్రలకు ఇబ్బంది అవుతుందని తన దృష్టికి వచ్చినందున వంట పాత్రలు అలాగే ప్రతి పాఠశాలలో బెంచీలు సరఫరా చేస్తామని,ఆర్ఓ ప్లాంట్ మరియు సెప్టిక్ ట్యాంక్, బాలికల పాఠశాలలకు కాంపౌండ్ వాల్,డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తామని,లేబరేటరీలు డెవలప్ చేయడానికి అన్ని రకాల సామానులు ఈ ఎండాకాలం సెలవులు కాగానే సమకూరుస్తామని, పిల్లలకు మాత్రం నాణ్యమైన విద్యను అందించడానికి అందరూ ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారినిలు మణెమ్మ,విజయలక్ష్మి, ఏ సి ఎం ఓ రమణయ్య,ఏటీడీవోలు అశోక్ కుమార్, జహీరుద్దీన్,చంద్రమోహన్,రాధమ్మ ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
