కొమరం భీం కాలనీ గుడిసె వాసులకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు పోరాటం ఆగదు
ప్రజా ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న ప్రజలు కనబడటం లేదా?
జిల్లా మంత్రులు రయ్ రయ్ మంటూ పర్యటనలు కాదు ప్రజా సమస్యలు పట్టించుకోండి.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో గుడిసె వాసుల పాదయాత్ర
J365 NEWS: కొమరం భీం కాలనీవాసులకు ఇళ్ల స్థలాలు దక్కేవరకు పోరాటం ఆగదని,ఇది ఆరంభం మాత్రమేనని జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న గుడిసె వాసుల గోస కనబడడం లేదా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ప్రశ్నించారు. చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వెంకటేశ్వర కాలనీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలవేసి నివాళులర్పించి పాదయాత్రను ప్రారంభించారు.మహిళలు బతుకమ్మలను ఎత్తుకొని గుడిసెల బతుకమ్మకు ఇల్లు ఇవ్వాలని నినాదాలు చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం దగ్గర సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లిక్కి బాలరాజు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో పోతినేని మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా నాలుగు వందల యాభై మంది పేద కుటుంబాలు గుడిసెలు వేసుకొని కనీస మౌలిక సదుపాయాలు లేకుండా నివాసం ఉంటే ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కొమరం భీం కాలనీవాసులు ఈ జిల్లా ప్రజలు కారా? వారికి ఇందిరమ్మ పథకం వర్తించదా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తామని ఆరేళ్లు కాలయాపన చేసి చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్న వీరి బాధలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇల్లు నిర్మించే వరకు కనీసం తాగడానికి మంచినీళ్లు కరెంటు సౌకర్యం కల్పించమని అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులను కలిసిన కనికరం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.నీటి కోసం సెలెమెలు తవ్వుకొని అవే నీళ్లు తాగుతున్న ప్రభుత్వానికి కనీస మానవత్వం లేకుండాపోయిందని విమర్శించారు.చీకటిలో జీవితాలు గడుపుతూ ఎండ వాన చలిలో గత్యంతరం లేక అక్కడే నివాసం ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాములు తేళ్లు పురుగుల మధ్య తమ జీవనాన్ని కొనసాగిస్తున్న అధికారులకు మాత్రం చీమకుట్టినట్లుగా కూడా లేదని పేద ప్రజల ఓట్లపై ఉన్న ప్రేమ వారి జీవితాలపై పాలకులకు లేదని విమర్శించారు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు రయ్ రయ్ మంటూ సుడిగాలీ పర్యటనలు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు చేసిన మేలు ఏంటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే గారు పేదల తరఫున పనిచేసే పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారని ఎమ్మెల్యే చొరవ చూపించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే విధంగా సహకరించాలని కోరారు. ఈ పాదయాత్ర ద్వారా అయినా జిల్లా మంత్రులకు ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు.
