గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు పాఠ్యబోధనతో పాటు వివిధ కళలు, విజ్ఞానం, నైపుణ్యాలు నేర్పుతూ వారిని భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా, ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఐఎఎస్ అన్నారు.ఆదివారం సాయంత్రం భద్రాచలం బీ.ఎడ్. కళాశాలలో వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు, పీడీలు, పిఈటీలకు నిర్వహించిన తొమ్మిది రోజుల కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు 15 రోజులుగా శిక్షణ పొందిన గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు, డీఆర్పీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గిరిజన విద్యాభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలపై ఆయన సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్, ఈ శిక్షణలు ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను పెంపొందించడంలో, తరగతి గదిలో మరింత ప్రభావవంతమైన బోధన అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంపొందించుకోవడం, గణితం పట్ల ఉండే భయం తొలగించుకోవడం ఉపాధ్యాయుల నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.సైన్స్ ల్యాబ్‌ల అభివృద్ధికి కావాల్సిన అన్ని సదుపాయాలు త్వరలో అందజేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు చక్కటి బోధన అందిస్తే విద్యార్థులు గ్రూప్-1,గ్రూప్-2, సివిల్స్ వంటి ఉన్నత పరీక్షలపై ఆసక్తి చూపి మెరుగైన కెరీర్‌ను నిర్మించుకుంటారని తెలిపారు.పాఠాలను కేవలం కంఠస్థం చేయించే విధానాన్ని విడిచిపెట్టి, విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన అభివృద్ధి చేసేందుకు ఉపాధ్యాయులు కొత్త పద్ధతుల్లో బోధన చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల్లో దాగి ఉన్న బోధన నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి శిక్షణలు దోహదం చేస్తుందనీ అభిప్రాయపడ్డారు.గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అవసరమైనంత వరకూ ఖర్చు చేయడానికి వెనుకాడబోనని, వారిని ఉన్నత స్థానాలకు చేర్చేందుకు తాను నిరంతరం సహాయ సహకారాలు అందిస్తానని రాహుల్ హామీ ఇచ్చారు.కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, బీ.ఎడ్. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీరు నాయక్,ఏసీఎంఓ రమేష్, ఎస్‌సీఆర్‌పీ మోతిలాల్, డీఆర్పీలు మరియు వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
