బంజారాల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ ఉత్సవాలు నిలయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బంజారా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ బానోత్ వీరు నాయక్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో నిర్వహిస్తున్న తీజ్ వేడుకల్లో మంగళవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తున్నారని తెలిపారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా వివాహం కాని యువతులు తీజ్ వేడుకలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం సాధు సంత్‌లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్‌పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు వందల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉందన్నారు. బంజారాల ప్రత్యేక జీవన విధానం, ఆచార వ్యవహారాలు, పండుగలను కాపాడుకోవడంతో పాటు వాటి విశిష్టతను భావితరాలకు తెలియజేయాలని సూచించారు. తీజ్ వంటి సంప్రదాయ పండుగలు బంజారా సమాజ ఐక్యతను చాటిచెబుతాయని అన్నారు.కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయకులు ధరావత్ కాన్షీరామ్, బానోత్ రమేష్, గుగులోత్ భద్రు, భూక్య శ్రీనివాస్, ధరావత్ కృష్ణ, జాటోత్ భరత్, నూనావత్ రవి, రమేష్ రాథోడ్, బానోత్ రాములు, రవి, భూక్య మోతిలాల్, బానోత్ హీరాలాల్, కున్సోత్ ప్రసాద్, భూక్య బాబులాల్, సపావట్ బాలకృష్ణ, జె.బి. బాలు, లావుడ్య హన్మంతు, సాధు సంత్‌లు, గురువులు ధరావత్ నర్సింహా, మొక్కల బాలు, సోషల్ మీడియా ఇన్‌చార్జి వినోద్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.
