Sat. Jan 31st, 2026

అనకాపల్లి జనవరి-23 (J365 న్యూస్ ) రాష్ట్రంలో సీనియర్ నాయకుడిగా ఉన్న కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆకాంక్షించారు. కొణతాల రామకృష్ణ జనసేనలో చేరిక సందర్భంగా అనకాపల్లిలోని పెంటకోట కన్వెన్షన్ హాల్లో అభిమానులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ కలుసుకొని అభినందనలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం రామ్ మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ముందుగా చేరిన వారిలో కొణతాల రామకృష్ణ ఒకరు అన్నారు. ఆ తరువాత జగన్ వైఖరి నచ్చకపోవడం తో పార్టీ నుంచి దూరమైన రామకృష్ణ సుదీర్ఘకాలం తటస్థంగా ఉన్నప్పటికీ ఎట్టకేలకు జనసేన ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షను మరింత బలోపేతం చేసుకున్నారన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరితో రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని రామ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే వైసిపి కి చెందిన అనేక మంది సీనియర్ నేతలు రాజీనామా చేసి బయటికి వచ్చారని మరికొద్ది రోజులలో వైసిపి పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు నేతలు వైయస్ జగన్ కు తొత్తులుగా మారి.. తమ సొంత ప్రాంతాన్నే బ్రష్టు పట్టిస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. నిజంగా అటువంటి వారికి చిత్తశుద్ధి ఉంటే కొణతాల రామకృష్ణ బాటలోను, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ బాటలోనూ వైసిపి నుంచి బయటికి రావాలన్నారు. రాబోయే రోజులలో తెలుగుదేశం – జనసేన కూటమి ఘన విజయం సాధించడం ద్వారా.. వైసిపి భూస్థాపితం అవుతుందన్నారు.

Share this post...