– జన్మనిచ్చిన నేల కొత్తకోట గ్రామానికి, ఇక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించి ఋణం తీర్చుకుంటాను
– కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజనసభలో మనసు విప్పి పలు విషయాలు మాట్లాడిన పి.వి.ఎస్.ఎన్.రాజు
J365 NEWS, చోడవరం : కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజనసభ బుధవారం కొత్తకోటలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ మహాసభకు వందలాదిగా సభ్యులు తరలివచ్చారు. ఈ సభలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ భవిష్యత్తులో తమ వ్యవసాయ ప్రయోజనాల్ని కాపాడడానికి సొసైటీ నుంచి పూర్తి సహకారం కావాలని కోరడం జరిగింది. వారిని ఉద్దేశించి చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలు కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నాను అని, జన్మనిచ్చిన నేల కొత్తకోట గ్రామానికి, ఇక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించి ఋణం తీర్చుకుంటా అన్నారు. రైతులే సమాజానికి వెన్నెముకని, రైతుల ప్రయోజనాలు కాపాడటమే తమ లక్ష్యమని ఈ సొసైటీ ద్వారా రైతులకు అన్ని ప్రయోజనాలను సక్రమంగా అందిస్తామన్నారు. ఎటువంటి లోటుపాట్లు పొరపాటు లేకుండా సొసైటీ ద్వారా వ్యవసాయదారులందరికీ అండగా నిలుస్తామని, అలాగే భవిష్యత్తులో జాయింట్ లైబిలిటీ గ్రూపులు ఏర్పరిచి మహిళలకు పొదుపు ఆర్థిక స్వావలంబన వచ్చే విధంగా సొసైటీ ద్వారా వారికి ఆర్ధిక వనరులు అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో సొసైటీ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించే విధంగా కుటీర పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా సొసైటీ పరిధిలో ఉన్న 14 గ్రామాల వెనుకబడిన ప్రజలందరి జీవితాల్లో మరింత ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి పూర్తిస్థాయిలో పనిచేస్తామని భరోసా ఇచ్చారు.
మన గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కలసి పని చేద్దామని పాల్గొన్న సభ్య రైతులకు పిలుపుయిచ్చారు. సభలో పాల్గొన్న పలువురు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రాజు సుమారు 15 సంవత్సరాలనుండి నిస్వార్ధంగా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తున్నారని, ప్రజలకోసం అను నిత్యం పరితపించే అరుదయిన నాయకుడని అందుకే ఆయన్ని పార్టీలకు అతీతంగా అందరూ అభిమానిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పరిధిలో గల 14 గ్రామాల నుండి అధిక సంఖ్యలో రైతులు వారితో పాటు నాయకులు, సర్పంచులు వివిధ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సొసైటీ డైరెక్టర్లు గట్రెడ్డి ఎరుకు నాయుడు, బలిరెడ్డి గణేష్, సొసైటీ సీఈవో గుర్రాల రఘు తదితరులు పాల్గొన్నారు.

