J365న్యూస్ : సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, పరిసర ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు గల మరింత నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.బలరామ్ ఆదేశంతో సింగరేణి పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ విద్యా బోధనను ప్రవేశపెట్టడానికి యాజమాన్యం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. తొలుతగా రామగుండం-2 ఏరియాలోని యైటింక్లైన్ కాలనీలో ఉన్న సెక్టార్-3 సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ బోధనను ప్రవేశ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమైంది.
ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్( సీబీఎస్ఈ)కు దరఖాస్తు సమర్పించింది. ఈ విషయాన్ని ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర సెకండరీ విద్య విధానం నుండి సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానంలోకి సింగరేణి పాఠశాలల్లో బోధన జరుపుకోవడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని రాష్ట్ర విద్యాశాఖ నుండి ఒక అనుమతి లేఖను(నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) కూడా సింగరేణి సంస్థ పొందింది.
ఈ లేఖను జతపరుచుతూ సీబీఎస్ఈ బోర్డుకు గత వారం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించింది. తమ పాఠశాలలో వచ్చే ఏడాది నుండి సీబీఎస్ఈ బోధనకు అనుమతి ఇవ్వాలని సింగరేణి సంస్థ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను కోరింది.ఈ లేఖను స్వీకరించిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని సీబీఎస్ఈ ప్రధాన కార్యాలయం నుంచి త్వరలోనే ఒక ఉన్నతస్థాయి బృందం సింగరేణి పాఠశాల పరిశీలనకు రానుంది. ఆ బృందం వారు సింగరేణి పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న తరగతి గదులను, పాఠశాల క్రీడా మైదానం , ప్రయోగ శాలలు, ఇతర మౌలిక వసతులు తదితర అన్ని అంశాలను పరిశీలించి తమ శాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తారు.ఈ పని రానున్న మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇక్కడి వసతులపై సంతృప్తి చెందినట్లయితే ప్రాథమికంగా రామగుండం-2 ఏరియాలోని సెక్టార్-3 సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ బోధనను ప్రారంభించేందుకు అనుమతించే అవకాశం ఉంది. ఇదే పాఠశాలలో గత ఏడాది పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే.కార్మికుల పిల్లలకు అత్యుత్తమ విద్య కోసం సీబీఎస్ఈ బోధనను సింగరేణి పాఠశాలల్లోని విద్యార్థులకు అందించాలని సంస్థ ఛైర్మన్ భావించారు. మొదట సెక్టార్-3 పాఠశాలలో సీబీఎస్ఈ బోధన ప్రారంభించాలని, అనంతరం శ్రీరాంపూర్ ఏరియాలోనూ దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే సింగరేణిలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలను ఆధునికీకరణ ప్రక్రియ ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు, కంప్యూటర్లు, ల్యాబ్ తదితర సౌకర్యాల కోసం అవసరమైన అనుమతులు జారీ చేశారు. ఈ మేరకు సింగరేణి విద్యా శాఖ పర్యవేక్షణలో సివిల్ విభాగం ఆధ్వర్యంలో ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. సింగరేణి పాఠశాల్లో సీఈఎస్ఈ బోధనకు చొరవ తీసుకున్న సంస్థ ఛైర్మన్కు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.
