
పాల్వంచ (హేమశ్రీ బాలు రిపోర్ట్స్): రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయుటకోసం బడ్జెట్‌లో 15% నిధులు కేటాయించాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టియస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. శనివారం పాల్వంచలో టిఎస్ యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చావ రవి మాట్లాడుతూ..విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కనీసం 15% కేటాయించాలని క్రమంగా దేనిని 20%కు పెంచాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రాథమిక పాఠశాలల బలోపేతం కోసం ప్రత్యేక కేంద్రీకరణ జరగాలని, పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని,పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని,వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.బకాయి పడిన ఐదు వాయిదాల డిఎ లను వెంటనే విడుదల చేయాలని, పిఆర్సీ నివేదిక తెప్పించుకుని సంఘాలతో చర్చించి అమలు చేయాలని, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ పథకం సక్రమంగా అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఎంప్లాయీస్ జెఎసి ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి యం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేక్ పాషా, మండల అధ్యక్షుడు ఎ విజయభాస్కర్, సీనియర్ నాయకులు బి జానకి రాములు,ఎ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
