గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థుల్లో క్రీడా ప్రతిభ కలిగిన వారిని గుర్తించి, వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సూచించారు.మంగళవారం రాత్రి ఐటిడిఏ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనంలో వ్యాయామ ఉపాధ్యాయులతో జోనల్ స్థాయి క్రీడల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 18, 19 తేదీల్లో కిన్నెరసాని క్రీడా పాఠశాలలో ఐటిడిఏ జోనల్ స్థాయి క్రీడలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ పోటీలను ఏడు జోన్ల లీగ్ పద్ధతిలో నిర్వహించి, ప్రతిభావంతులైన విద్యార్థులను రాష్ట్రస్థాయి క్రీడల కోసం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.గెలిచిన జట్లకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు.ఆశ్రమ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల కృషితో విద్యా ఫలితాలతో పాటు క్రీడా రంగంలో కూడా విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారని ప్రశంసించారు.ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా రాష్ట్రస్థాయి గిరిజన క్రీడల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్త క్రీడలకు పరికరాలు అందజేస్తాం.ప్రతి పాఠశాలలో కొత్త క్రీడలను ప్రవేశపెడితే,ఆ పాఠశాలలకు అవసరమైన క్రీడా పరికరాలను ఐటిడిఏ అందజేస్తుందని బి.రాహుల్ వెల్లడించారు.విద్యార్థులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తర్ఫీదు (శిక్షణ) తప్పనిసరిగా అందుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డి.అశోక్, క్రీడల అధికారి బొల్లి గోపాలరావు, ఏటీడీవో చంద్రమోహన్,ఏసీఎంఓ రమేష్, ఏఎస్ఓ వెంకటనారాయణ, సోయం నాగేశ్వరరావు, బండ రాంబాబు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్. బాలసుబ్రమణ్యం,బుగ్గ వెంకటేశ్వర్లు,నగేష్,నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
