Tue. Mar 31st, 2026

               GPW సికింద్రాబాద్ మరియు JNGPT రామంతాపూర్ లో జరిగిన సృజన టెక్ ఫెస్ట్ 2025–26 రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండి.శ్రీనివాస్,విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజేతలను మరియు విజేతల తల్లిదండ్రులను సన్మానించి అభినందించారు.సాంకేతిక ప్రతిభ, సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను ఈ సందర్భంగా ప్రశంసించారు.సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రాజెక్ట్ ప్రదర్శనకు “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఇన్నోవేషన్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్” అనే అంశాన్ని తీసుకున్నారు. విద్యార్థులు వాస్తవ జీవన మౌలిక వసతుల సమస్యలకు స్మార్ట్ పరిష్కారాలు, స్థిరమైన నిర్మాణ పద్ధతులు మరియు ఆధునిక డిజైన్ ఆలోచనలను ప్రదర్శించి న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నారు. విజేతలు తమ ప్రాయోగిక దృష్టి మరియు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రాజెక్ట్ ప్రదర్శనకు “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ క్రాప్ మేనేజ్‌మెంట్” అనే అంశాన్ని తీసుకున్నారు.విద్యార్థులు వ్యవసాయ రంగంలో స్మార్ట్ పద్ధతులు, యాంత్రిక పరిష్కారాలు మరియు వనరుల సమర్థ వినియోగంపై వినూత్న ఆలోచనలను ప్రదర్శించారు.విజేతలు తమ సృజనాత్మకత,ఖచ్చితత్వం మరియు ప్రాయోగిక దృక్పథంతో ప్రత్యేకంగా నిలిచారు.ఈ విజయానికి మార్గదర్శకులుగా నిలిచిన సివిల్ ఇంజినీరింగ్ విభాగపు లెక్చరర్  జె.హరికృష్ణ మరియు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగపు సీనియర్ లెక్చరర్ కే.టి. రఘురాం ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా  ప్రిన్సిపాల్ ,అధ్యాపకులు విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ, ఇలాంటి వేదికలు వారి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

Share this post...