టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు వ్యాఖ్యలపై జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి తెలియకుండానే మాట్లాడటం సరికాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.గజ్వేలులో ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు విషయంలో ఎలాంటి వివాదం అవసరం లేదని వీరబాబు అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోలు ఉండటం సాధారణమేనని, గజ్వేలు క్యాంప్ కార్యాలయంలో కూడా అదే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిని రాజకీయంగా తప్పుగా చూపించే ప్రయత్నాలు చేయడం సరైంది కాదన్నారు.గత టిఆర్ఎస్ పాలనలో అనేక అక్రమాలు, దాడులు జరిగాయని ఆరోపించిన ఆయన, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందన్నారు. ప్రజల కోసమే పనిచేసే ప్రజా ప్రభుత్వమిదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వీరబాబు తెలిపారు. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, అనవసర ఆరోపణలు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రేగ కాంతారావుకు సూచించారు.
