Sat. Apr 4th, 2026

     ఖమ్మం, ఏప్రిల్ 4:  మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ శాసనసభ్యుడు కె.చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి పిరికిపంద చర్య అని మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆమె శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.అనేక ఏళ్ల పోరాటంతో శాంతియుతంగా తెలంగాణను సాధించిన నాయకుడికి కాంగ్రెస్ ఇస్తున్న గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. క్యాంపు కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో లేదనేది కేవలం సాకు మాత్రమేనని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక విపక్ష నేతలు ఆయన ఫోటోను తమ కార్యాలయాల్లో పెట్టలేదని గుర్తుచేశారు.ఇప్పుడు విపక్ష ప్రజాప్రతినిధులందరూ తమ కార్యాలయాల్లో ప్రధాన మంత్రి ఫోటోను పెడుతున్నారా అని ఆమె ప్రశ్నించారు. గౌరవం అనేది చర్యల ద్వారా సంపాదించాల్సిందే తప్ప, ఇటువంటి దౌర్జన్యాలతో కాదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, ఆ అసంతృప్తి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దాడులు చేయడం కాకుండా ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారించాలని ఆమె సూచించారు.

Share this post...